పెన్షన్ ఓ ప్రాథమిక హక్కు (నేడు జాతీయ పెన్షనర్స్ డే)
'నకార కేసు' లో సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనల ప్రాతిపదికగా ఐదవ కేంద్ర వేతన సంఘం ''పెన్షన్ అన్నది బిక్షగాళ్ళకు వేసే ధర్మంలాంటిది కాదు. వయోధిక పౌరులను, వారి వయసుకు తగిన రీతిలో హుందాగా,మర్యాదపూర్వకంగా పరిగణించాల్సిన అవసరం వుంది. పెన్షన్ అన్నది వారి చట్టబద్ధమైన, అన్యా క్రాంతానికి తగని, న్యాయపరంగా అమలు పరచాల్సిన హక్కు. అది వారు చమటోడ్చి సాధించుకొన్నది. అందువల్ల ఉద్యోగుల జీతభత్యాల లాగే పెన్షన్ని కూడా నిర్ధారిస్తూ, సవరిస్తూ, మార్పులు చేర్పులు చేయాల్సి వుంద''ని పేర్కొంది.
భారతదేశంలో 2004 తర్వాత పెన్షన్ సంస్కరణలు, పిఎఫ్ ఆర్డి ఎ (పెన్షన్ ఫండ్ క్రమబద్ధీకరణ, అభివృద్ధి సంస్థ) బిల్లు, ప్రపంచబ్యాంకు పెన్షన్ నమూనాకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.
పెన్షన్ సంస్కరణలలో ప్రభుత్వానికి బాగా నచ్చినది, ప్రస్తుతమున్న పెన్షన్ స్థానంలో కంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీం ప్రవేశపెట్టాలన్నది. ఈ పెన్షన్ స్కీం అమలు జరుపుతున్న దేశాలలో చిలీ, స్వీడన్, పోలెండ్, మెక్సికో, ఆస్ట్రేలియా, హంగరీ, కజకిస్థాన్ వంటి దేశాలున్నాయి.భారత ప్రభుత్వం ప్రధానంగా చిలీ పెన్షన్ సంస్కరణ పథకం పట్ల మరింతగా ఆకర్షితురాలైంది.
2004, జనవరి 1నుండి కేంద్రప్రభుత్వ సర్వీసులలో చేరే నూతనఉద్యోగులకుపిఎఫ్ఆర్డిఎ బిల్లు ద్వారా నూతన పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది అమలులో వున్నకంట్రిబ్యూటరీ యేతర డిఫైన్డ్ బెనిఫిట్ పథకానికి బదులు డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ప్రతిపాదిస్తోంది. దీని క్రమబద్ధీకరణ నిర్వహణ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పిఎఫ్ఆర్డిఎ) చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ మూలవేతనం, డిఎ పై 10శాతం చెల్లిస్తే, అంతే మొత్తం ప్రభుత్వం జమచేస్తుంది.
బ్యాంకులలో 2010 ఏప్రియల్ 1 న, లేదా ఆ తరువాత చేరిన ఉద్యోగులు, అధికార్లకు ఈ స్కీం వర్తింపజేయ బడుతోంది. ఈ ఉద్యోగులకు వేరేగా మరెలాంటి ప్రావిడెంట్ ఫండ్ లేదు. ఈ ఉద్యోగ వ్యతిరేక పెన్షన్ ఫండ్ బిల్లు (పిఎఫ్ఆర్డిఎ)నుపార్లమెంటులో ఆమోదం పొందడంతో ఈ విశేష హక్కును కేంద్రప్రభుత్వం తీసుకోంది. ఈ కొత్త పెన్షన్ పథకంలో ఉన్నవారి పెన్షన్ మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి వుంటుంది. ఆ విధంగా జీవన సంధ్యా సమయంలో వారి ఆదాయం అనిశ్చితిగా మారి కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇది ప్రయివేటు మదుపుదార్ల, షేర్ మార్కెట్ ప్రయోజనాలను కాపాడడానికే తప్పఉద్యోగుల భద్రతకు ఏ మాత్రం సరిపడనిది.
ఈ సి పి యస్ పరిధిలో నేటికి 16.40 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 30 లక్షల మంది ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఏపీ వారు దాదాపు 1.60 లక్షల మంది వున్నారు. ఇటీవల సీపీఎస్పై పోరాటాలు మన రాష్ట్రంతో బాటు దేశవ్యాపితంగా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల పెన్షన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే . ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సిపియస్ రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
భారతదేశంలో ప్రస్తుతం 60 ఏళ్ళ పైబడినవారు 9శాతానికిమించివున్నారు. అంటే సుమారు 10 కోట్లమంది. ఈ సంఖ్య 2050 నాటికి 21 శాతానికి అంటే 33.6 కోట్లకు చేరుకొంటుంది. మనదేశంలోని 60ఏళ్లు పైబడిన వృద్ధులందరికి - వారు వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ము కొనేవారు కావచ్చు. లేదా ఇళ్ళల్లో పనిచేసే ఇంటిపని వారుకావచ్చు - ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత, జీవిత సంధ్యా సమయంలో వారందరికీ ఒక భరోసాగా పెన్షన్ సాధించాల్సి వుంటుంది. వారంతా వయసులో వున్నంతకాలం శ్రమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తోడ్పడినవారే. అంటే ఇప్పుడు పెన్షనర్ల పెన్షన్ను పరిరక్షించడం, పెన్షన్ లేనివారికి పెన్షన్ కల్పించడమే పాలకుల ముందున్న కర్తవ్యం.
.jpeg)
0 Post a Comment:
Post a Comment